అరటి మొక్కలు నాటిన 9-10 నెలల్లో దిగుబడి చేతికి రావడం జరుగుతుంది. నేల యొక్క స్వభావాన్ని మరియు వాతావరణ పరిస్థితులను బట్టి మొక్క రకాలను ఎంచుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం రైతులు హైడేన్సిటి (అధిక సాంద్రత) పద్ధతి ద్వారా మంచి దిగుబడులను తీస్తున్నారు కావున ఈ హైడేన్సిటి పద్ధతిలో పాటించవలసిన దూరాలు మొక్కకి మొక్కకి మధ్య దూరం 4 ఫీట్లు, సాలుల మధ్య దూరం 4 ఫీట్ల దూరాలను పాటించినట్లయితే ఒక్క ఎకరానికి 1500 నుండి 1600 మొక్కల వరకు అవసరం పడుతుంది. సాధారణ పద్ధతి ద్వారా అరటి తోట సాగు చెయ్యాలని బావించే రైతులు పాటించవలసిన దూరాలు మొక్కకి మొక్కకి మధ్య దూరం 5 ఫీట్లు, సాలుల మధ్య దూరం 5-6 ఫీట్ల దూరాలను పాటించినట్లయితే ఒక్క ఎకరానికి 800 నుండి 1000 మొక్కల వరకు అవసరం పడుతాయి.
మొక్కలు నాటుకునే విధానం
ఈ అరటి మొక్కలు నేలలో దుంప అభివృద్ధి చెందుతూ వేరు వ్యవస్థ వ్యాప్తి జరుగుతుంది కావున అరటి తోట వేయుటకు ఎంచుకున్న నేలను ఒక్క ఫీటు లోతు వరకు నేల మొత్తం వదులు అయ్యే విధంగా 2-3 సార్లు దున్నుకొని మొక్కలు నాటడానికి సిద్ధం చేసుకోవాలి. మొక్కలు నాటేముందు అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడటానికి మొక్కలకు 50 శాతం ఎండ తగిలే విధంగా 10 నుండి 20 రోజులు తగినన్ని నీటిని అందిస్తూ ఉండాలి. మొక్కని నాటే గుంతలో సింగిల్ సూపర్ పాస్ఫేట్ 200 నుండి 300 గ్రాములు మరియు పశువుల ఎరువు 3 నుండి 4 కిలోలు కలుపుకొని మొక్క కోసం తీసిన గుంతలో వేసుకొని మొక్కను నాటుకోవాలి. మొక్క నాటుకున్న వెంటనే నీటిని అందివ్వాలి.
నీటి యాజమాన్యం
అరటి తోటకు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది కావున అధిక దిగుబడులకోసం క్రమ పద్ధతిలో నీటిని అందిచావలసి ఉంటుంది. అధిక సాంద్రతలో సాగు చెయ్యాలని బావించే రైతులు కచ్చితంగా డ్రిప్ పద్ధతని ఉపయోగించిడం మంచిది. ఈ డ్రిప్ వినియోగించడం ద్వారా పోషకాలను కూడా డ్రిప్ ద్వారా ప్రతి మొక్కకు సరైన విధంగా అందేల చూసుకోవచ్చు.
కలుపు యాజమాన్యం
సాలుల మధ్య మరియు మొక్కల వరుసల మధ్య నాగళ్ళతో దున్నుకొని చెట్టు చుట్టూ ఉన్న మట్టిని చెట్టు మొదలు వద్దకు ఎగత్రోయ్యడము ద్వారా మొక్క మొదలు బలంగా ఉండటముతోపాటుగా కలుపు పూర్తిగా నివారించవచ్చు. తోట వయస్సు 4 నెలల వరకు మొక్కలు ఎదగడం వలన సూర్యరశ్మి నేల మీద పడదు కావున కలుపు కూడా ఆగిపోతుంది కావున 4 నెలల వరకు కలుపు నివారణ పద్ధతులన పాటించవలసి ఉంటుంది.
అధిక దిగుబడులకోసం పాటించవలసిన పద్ధతులు
- మొక్క ఎదుగుదల సమయములో ప్రతి 40-50 రోజులకు ఒక్కసారి నత్రజని (యూరియ) 50 గ్రాములు మరియు పోటాష్ 50 గ్రాములు కలుపుకొని వేసుకోవాలి. ఈ ఎరువులు మొక్క వయస్సు 130 రోజులు వచ్చే వరకు వేసుకోవాలి.
- అరటి కాయల నాణ్యత బాగుండి గెల అధిక బరుకోసం పువ్వు బయటకి వచ్చినప్పడి నుండి కాయలు బలంగా తయారు అయ్యే వరకు ప్రతి 15 రోజులకు ఒక్కసారి సల్ఫేట్ ఆఫ్ పోటాష్ 5 గ్రాములు ఒక్క లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
- కాయల పరిమాణం తక్కువ లేదా పెరుగుదల ఆలస్యంగా ఉన్న సమయాల్లో పొటాషియం నైట్రైట్ 5 గ్రాములు మరియు సల్ఫేట్ ఆఫ్ పోటాష్ 5 గ్రాములు ఒక్క లీటర్ నీటికి కలుపుకొని 7-10 రోజులకు ఒక్కసారి పిచికారి చేసుకోవాలి.
- మొక్క వయస్సు 3 నెలలు ఉన్నప్పడి నుండే చెట్టు చుట్టూ పిల్ల మొక్కలు రావడం మొదలవుతుంది. కావున పిల్ల మొక్కలను పూర్తిగా తొలగించాలి. దీనిద్వారా తల్లి మొక్కకి పూర్తి పోషకాలు అందడం జరిగుతుంది.
- పువ్వు నుండి అన్ని హస్తాలు విచ్చుకున్న 10-15 రోజులకు 13:00:45 5గ్రాములు కలుపుకొని పిచికారి చేసుకోవాలి. 25-30 రోజులకు 13:00:50 5గ్రాములు కలుపుకొని పిచికారి చేసుకోవాలి. దీనిద్వారా గెల నాణ్యత బాగుంటుంది.
- పువ్వు నుండి అన్ని హస్తాలు విచ్చుకున్న తరువాత రక్షణ పత్రాలను మరియు పువ్వును తొలగించాలి.
- గెల యొక్క బరువుకి చెట్టు పడిపోయే అవకాశం ఉంది కావున కర్రలను చెట్టుకు సపోర్ట్ (ఉతంగా) పెట్టుకోవాలి.
- అరటి ఆకులపై రసాయనాలను పిచికారి చేసినప్పుడు జారిపోతుంది కావున పిచికారి చేసిన మందు ఆకుపై నిల్వడానికి ప్రతి పిచికారిలో జిగురు ద్రావణలు అయినటువంటి స్యడవిట్ లేదా ధనవిట్ 1 మీ.లి ఒక్క లీటర్ నీటికి కలుపుకోవాలి.
- అరటి తోట ఒక్కసారి వేసి 3-4 సార్లు కూడా దిగుబడులను తీసుకోవచ్చు కావున పూత మొదలైన సమయములో ఒక్క పిల్ల మొక్కని తల్లి మొక్కతో సహా పెరగనివ్వాలి ఈ పిల్ల మొక్కలు తరువాత దిగుబడి కోసం ఉపయోగాపడుతుంది.
చిడపిడలు మరియు తెగుళ్ళు
ఆకుమచ్చ తెగులు (సిగటోగ)
ఆకుమచ్చ తెగులు ఆశించిన మొక్కల ఆకులపై చిన్న మచ్చలుగా ఏర్పడి పూర్తి ఆకు పసుపుపచ్చగా మారిపోయి ఎండిపోవడం జరుగుతుంది. దీనిద్వారా మొక్కకి కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగక మొక్కకి సరైన శక్తి అంధక దిగుబడిపై ప్రభావం పడుతుంది. ఆకుమచ్చ తెగులు ఆశించిన సమయములో నివారణ చర్యగా మ్యాన్కోజేబ్ 3 గ్రాములు (లేదా) ప్రోపికోనజోల్ 1 మీ.లి (లేదా) కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు (లేదా) క్లోరోథాలోనిల్ 2 గ్రాములు కలుపుకొని పిచికారి చేసుకోవాలి
దుంప కుళ్ళు తెగులు
ఈ దుంప కుళ్ళు తెగులు మొక్క వయస్సు 4 నెలలలోపు వరకు వస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కలు దుంప కుళ్లిపోయి మొక్క చనిపోవడం జరుగుతుంది. దుంప కుళ్ళు తెగులు ఆశించి చనిపోయిన మొక్కలను తోటకు దూరంగా తీసుకెళ్ళి మంట పెట్టాలి. ఈ తెగులు ఆశించిన మొక్క చుట్టూ మరియు పక్కన ఉన్నటువంటి 2-3 వరుసల మొక్కలకు బ్లీచింగ్ పౌడర్ 25 గ్రాముల ఒక్క లీటర్ నీటికి కలుపుకొని మొక్కల చుట్టూ నేల తడిచే విధంగా పోసుకోవాలి.