మామిడి తోటలను గతములో దేశీయ సంప్రదాయ పద్దతిలో ఒక్క ఎకరానికి 40 నుండి 80 మొక్కల వరకే నాటుకునేవారు కానీ ప్రస్తుతం హైడేన్సిటి (అధిక సాంద్రత) పద్ధతి ద్వారా తగినన్ని జాగ్రతలు పాటిస్తూ ఒక్క ఎకరానికి 250 మొక్కల వరకు నాటుకొని అధిక దిగుబడులను సాధించడం జరుగుతుంది. మామిడి తోట సాగు చెయ్యాలని చూసే రైతులు వాతావరణ పరిస్థితులను, మార్కెట్ అందుబాటును బట్టి మొక్క యొక్క రకాలను ఎంచుకోవలసి ఉంటుంది.
మామిడి మొక్కలు నాటుకునే విధానం
మామిడి తోటలు సాగు చేయుటకు అన్ని రకాలైన నేలలు అనువైనవి. రైతులు మొక్కలను వర్షాకాలం మొదటి వారము నుండి నాటుకోవడం మంచిది. నర్సరీలో అంటుకట్టిన ఆరోగ్యకరంగా ఉండి ఒక్క సంవత్సరం నుండి ఒక్కటినర సంవత్సరాల వయస్సు ఉన్న మొక్కలను నాటుకోవడానికి ఎంచుకోవాలి. మొక్క నాటడానికి 20 నుండి 25 రోజుల ముందు గుంత తీసి పెట్టుకోవాలి. మొక్కలను నర్సరీ నుండి తరలించే సమయములో కానీ, మొక్కని గుంతలో నాటే సమయాల్లో కవర్లో ఉన్నటువంటి మట్టిని నీటితో తడపకుడదు. ఇలా తడపడం ద్వార మట్టి వదులుగామారి వేర్లకు గాలి తగలడం వలన మొక్క నాటిన తరువాత మరణించే అవకాశం ఉంది. మొక్కలు నాటుకునే సమయములో గుంతలో 3-4 కిలోల పశువుల ఎరువు, 1 కిలో వేప పిండి కలిపి వేసుకొని మొక్కను నాటుకోవాలి. అంటుకట్టిన కాడ భాగాన్ని నేలలో కప్పివేయ్యకుండా పైకి ఉండేలా చూసుకొని నాటుకోవాలి.
ఎరువుల యాజమాన్యం
మొక్క ఎదుగుతున్న సమయములో పశువుల ఎరువు మరియు వేపపిండి కలుపుకొని దఫా దఫాలుగా వేసుకోవాలి. మొక్క నాటిన మొదటి సంవత్సరం నత్రజని (యూరియ) 100 గ్రాములు, భాస్వరం 100 గ్రాములు, పోటాష్ 100 గ్రాములు కలుపుకొని రెండు దఫాలుగా వేసుకోవాలి.
నీటి యాజమాన్యం
మామిడి తోటకి నీటి వినియోగం తక్కువ అనే చెప్పుకోవచ్చు. మొక్క నాటిన తొలినాళ్ళలో నేలయొక్క స్వభావాన్ని బట్టి 7 నుండి 10 రోజులకు ఒక్కసారి నీటిని అందివ్వాలి. పూర్తిగా ఎదిగిన మొక్కకి 20 నుండి 30 రోజులకు ఒక్కసారి నీటిని అందిస్తే సరిపోతుంది. పూత మొదలయ్యే సమయానికి ముందు అనగా నవంబర్ నెలకి ముందు వరకు నీటిని అందివ్వడం అపివేయ్యాలి. పూత పూర్తిగా వచ్చి పిందె కాయలు ఏర్పడే సమయములో చెట్లు నీటి ఎద్ధడికి గురికాకుండా చూసుకోవాలి. దీనిద్వారా పిందే దశలో ఉన్నటువంటి కాయలు నేలరాలడం జరగదు.
అధిక దిగుబడులకోసం పాటించవలసిన పద్ధతులు
- మొక్క 3 అడుగులు పెరిగినప్పడి నుండే ఇగురు భాగాన్ని తుంచివెయ్యాలి. దీనిద్వారా కొమ్మలకి పక్క కొమ్మలు రావడం జరుగుతుంది.
- హైడేన్సిటి (అధిక సాంద్రత) పద్ధతి ద్వారా తోటను సాగు చేసే రైతులు మొక్కలు 6 నుండి 7 అడుగుల ఎత్తు మించకుండా చూసుకోవాలి.
- తోటకోసం అంటుకట్టిన మొక్కలనే ఎంచుకుంటాము కావున మొక్క నాటిన మొదటి సంవత్సరం నుండే పూత మొదలయ్యే అవకాశం ఉంది. ఇట్టి పూతను మొక్క నాటిన 3 సంవత్సరాల వరకు తొలగించాలి. దీనిద్వారా మొక్క బలంగా ఎదగడం జరుగుతుంది.
- కాయ మంచి నాణ్యతకోసం ఫ్రూట్ కవర్లను తొడగాలి.
చిడపిడలు మరియు తెగుళ్ల నివారణ
పిండి నల్లి
మొక్క నాటిన 3 సంవత్సరాల వరకు పిండి నల్లి బెడద అధికంగా ఉంటుంది. పిండి నల్లి తల్లి పురుగు నేలలో గుడ్లు పెడుతుంది. పిల్ల పురుగులు చెట్టు యొక్క కాండం మీదుగా ఆకులను చేరుకుంటాయి. కావున మొక్క కాండం వద్ద రసాయన జిగురు పూయడము ద్వార ఈ పురుగులు చెట్టు మీదకు చేరుకోలేవు. పిండి నల్లి బారిన పడిన మొక్కలపై నివారణ చర్యగా ఎసిఫేట్ 2 గ్రాములు (లేదా) డైమితోయేట్ 2 మీ.లి (లేదా) మేటాసిస్టాక్ 2 మీ.లి ఒక్క లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
గూడు పురుగు
పుష్పం మొదలయ్యే ఆకుల చివరలో ఆకులతో గూడులుగా ఏర్పరచుకొని పత్రహరితాన్ని తీసుకోవడం ద్వార ఆకులు ఎండిపోతాయి. దీనివల్ల పుష్పించడం తగ్గిపోతుంది. రసాయనాలు పిచికారి చేసే ముందు పొడవైన కర్రలతో ఈ పురుగులు ఏర్పరుచుకున్న గూడులను తొలగించాలి. లేకపోతే పిచికారి చేసిన రసాయన మందు గూడులోనికి ప్రవేసించదు. తొలగించిన గుడులను తగులబెట్టాలి. క్వినల్ఫాస్ 2 మీ.లీ (లేదా) మొనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ ఒక్క లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
తేనె మంచు పురుగు
ఈ తేనె మంచు పురుగు సంవత్సరం పొడవున ఉంటుంది. ఈ పురుగు పుష్పం వచ్చే చివరి ఆకుల మీద జిగురు వంటి పదార్ధాన్ని విసర్జించడం ద్వార మసితేగులు కూడా ఆశించడం జరుగుతుంది. మొనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ (లేదా) క్లోరిపైరిఫాస్ 2 మీ.లీ ఒక్క లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. తల్లి తేనె మంచు పురుగు చెట్టు యొక్క బెరడులో నివాసం ఏర్పరుచుకుంటాయి కావున రసాయన మందులు పిచికారి చేసేప్పుడు చెట్టు కాండం పూర్తిగా తాడిచేవిధంగా పిచికారి చేసుకోవలెను.