nimma thota sagu

నిమ్మ తోట సాగు విధానం – Lemon Cultivation in Telugu

కోతులు మరియు ఇతర వన్యప్రాణుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో రైతులు ఈ నిమ్మ తోట వేసుకోవడం మంచిది. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఈ పంట అనువైనది. నిమ్మ తోట వెయ్యడానికి అధిక లవణ శాతం ఉన్న నేలలు కాకుండా మిగతా అన్ని రకాల నేలలు అనువైనవి. నిమ్మ మొక్క నాటుకున్న 25 నుండి 30 సంవత్సరాల వరకు, సంవత్సరం పొడవున దిగుబడులను పొందవచ్చు. గతములో దేశీయ సంప్రదాయ పద్ధతిలో ఒక్క ఎకరానికి గరిష్టంగా 80 మొక్కల వరకే నాటుకునేవారు, కానీ ప్రస్తుతం హైడేన్సిటి పద్ధతి ద్వారా తగు జాగ్రతలు తీసుకుంటూ ఒక్క ఎకరానికి 200 మొక్కల వరకు నాటుకుంటున్నారు. నేలయొక్క రకాలను బట్టి మార్కెట్ అందుబాటును దృష్టిలో ఉంచుకొని నిమ్మ మొక్క రకాలను ఎంచుకోవడము మంచిది.

నిమ్మ మొక్కలు నాటుకొనే విధానం

రైతులు మొక్కలను జూలై నుండి ఆగస్ట్ మధ్య కాలములో నాటుకోవడం మంచిది. నర్సరీలో అంటుకట్టిన ఆరోగ్యకరంగా ఉండి  కనీసం ఒక్క సంవత్సరం వయస్సు ఉన్న ముదురు ఆకులు కలిగిన మొక్కలను నాటుకోవడానికి ఎంచుకోవాలి. మొక్కల మధ్య దూరాలు 18 నుండి 25 అడుగుల దూరాలు ఉండేలా చూసుకొని మొక్క కోసం గుంతలు తీసుకోవాలి. మొక్క నాటడానికి 20 నుండి 25 రోజుల ముందు గుంత తీసి పెట్టుకోవాలి. మొక్కలను నర్సరీ నుండి తరలించే సమయములో కానీ, మొక్కని గుంతలో నాటే సమయాల్లో కవర్లో ఉన్నటువంటి మట్టిని నీటితో తడపకుడదు. కవర్లోని మట్టిని తడపడం ద్వార మట్టి వదులుగామారి వేర్లకు గాలి తగలడం వలన మొక్క నాటిన తరువాత మరణించే అవకాశం ఉంది. మొక్కలు నాటుకునే సమయములో గుంతలో 3-4 కిలోల పశువుల ఎరువు, 1 కిలో వేప పిండి కలిపి వేసుకొని మొక్కను నాటుకోవాలి. అంటుకట్టిన కాడ భాగాన్ని నేలలో కప్పివేయ్యకుండా పైకి ఉండేలా చూసుకొని నాటుకోవాలి.

నీటి యాజమాన్యం

నిమ్మ తోటకి నీటి వినియోగం తక్కువగానే ఉంటుంది. మొక్కని నాటుకున్న వెంటనే నీటిని అందివ్వాలి. ఈ మొక్కలకు ఎక్కువ నీటిని అందించిన, మొక్కల వద్ద నీరు నిల్వ ఉన్న కూడా వేరుకుళ్ళు తెగులు వచ్చి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. మొక్కకి అందించే నీరు ఉప్పు నీరు అయ్యి ఉండకుడదు దీనివల్ల మొక్కలు చనిపోవడం జరుగుతుంది. పూత మొదలయ్యే 20 రోజుల ముందు నుండే నీటిని అందివ్వడం అపివేయ్యాలి. పూత నుండి పింద దశలో చెట్లు నీటి ఎద్ధడికి గురికాకుండా చూసుకోవాలి దీనిద్వారా పూత మరియు పిందె నేల రాలకుండా నివారించవచ్చు.

ఎరువుల యాజమాన్యం

తొలి వర్షాలు మొదలు అయ్యే సమయములో చెట్టు పాదుల వద్ద పశువుల ఎరువు, వేప పిండి, యూరియ 100 గ్రాములు, సింగిల్ సూపర్ పాస్ఫేట్ 200 గ్రాములు, పోటాష్ 100 గ్రాములు వేసుకోవాలి. కాయలు పగలడం లేదా సరైన పెరుగుదల లేనప్పుడు సుక్ష్మపోశాకలు అయినటువంటి జింక్ సల్ఫేట్ 10 గ్రాములు మరియు బోరాక్స్ 10 గ్రాములు ప్రతి మొక్కకి వేసుకోవాలి. వేసవిలో మంచి ధరలు ఉంటాయి కావున అధిక దిగుబడులకోసం ఒక్కొక్క చెట్టుకి 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 500 గ్రాముల యూరియ, 400 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పోటాష్ వేసుకొని నీటిని అందివ్వాలి. ఎరువులు వేసుకున్న 20 నుండి 25 రోజులలో పూత మొదలవుతుంది.

అధిక దిగుబడులకోసం తీసుకోవలసిన జాగ్రతలు

  • అంటుకట్టిన కాండానికి వచ్చిన కొమ్మలను మాత్రమే పెరగనివ్వాలి. అంటుకట్టిన భాగం కంటే క్రింద వచ్చిన కొమ్మలను తొలగించాలి.
  • నిమ్మ మొక్కలను అంటుకట్టిన మొక్కలనే నాటుతాము కావున మొక్క నాటిన ఒక్క సంవత్సరం నుండి పూత మొదలవుతుంది. ఇట్టి పూతను తొలగించి మూడవ సంవతరం నుండి మొదలయ్యే పూతను కాత కోసం వదిలేసి దిగుబడులను తీసుకోవాలి. దీనిద్వారా మొక్క బలంగా ఎదిగిన మంచి దిగువడులను పొందవచ్చు.
  • పూత మరియు పిందె దశలో ఉన్న కాయలు రాలకుండా ఉండటానికి ప్లానోఫిక్స్ 0.5 గ్రాములు ఒక్క లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
  • వేసవి సమయములో కాయ పరిమాణం తక్కువగా ఉండి కాయలో రసం శాతం తక్కువగా ఉంటుంది. కావున పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు ఒక్క లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
  • చెట్టు నుండి కాయ కోతల తరువాత కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. చెట్టు మీద ఉన్న ఎండుపుల్లలను తొలగించాలి.
  • వేసవి కాలములో మంచి మార్కెట్ ధరలు ఉంటాయి కావున నవంబర్ నెలలో మొదలయ్యే పూతను కాపాడుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

చిడపిడలు మరియు తెగుళ్ళు

గజ్జి తెగులు

nimma gajji thegulu
gajji thegulu

గజ్జి తెగులు కాయలు, ఆకులు, కొమ్మలపై ఉబ్బెత్తు మచ్చలుగా ఏర్పడటం జరుగుతుంది. దీనివల్ల కాయల నాణ్యత దెబ్బతింటుంది. ఈ గజ్జి తెగులు సోకినా కాయలు, ఆకులు, కొమ్మలను చెట్టు నుండి తొలగించి మొక్క కాండానికి బోర్డ్ పేస్ట్ పుయ్యాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు ఒక్క లీటర్ నీటికి కలుపుకొని పూర్తి చెట్టు తాడిచేవిధంగా పిచికారి చేసుకోవాలి.

బంక తెగులు

banka thegulu

మొక్కకి నీటిని అందిచేప్పుడు నీరు నేరుగా కాండానికి తగలడం ద్వారా ఈ బంక తెగులు ఆశిస్తుంది. కావున చెట్టు కాండం మొదలు చుట్టూ ఒక్క ఫీటు దూరం వరకు మట్టిని పోసుకోవాలి. ఈ బంక తెగులు భారిన పడిన మొక్క ప్రధాన కాండం నుండి బంక కారడం మొదలవుతుంది. ఈ బంకను కాండం నుండి తొలగించి కార్బండిజం 1 గ్రాము (లేదా) మంకోజేబ్ 3 గ్రాములు ఒక్క లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

వేరుకుళ్ళు తెగులు

veru kullu thegulu

ఈ వేరుకుళ్ళు తెగులు సోకినా మొక్క వేర్లు కుళ్లిపోయి మొక్క చనిపోవడం జరుగుతుంది. ఈ తెగులు మొక్క ఏ దశలో ఉన్నాకూడ ఆశిస్తుంది. వేరుకుళ్ళు ఆశించిన మొక్కలను తొలిదశలోనే గుర్తుంచాలి. కొంచెం ఆలస్యం అయినాకూడా మొక్క చనిపోయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కార్బండిజం 1 గ్రాము (లేదా) కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు ఒక్క లీటర్ నీటిలో కలుపుకొని చెట్టు వేర్లు తడిచే విధంగా చెట్టు చుట్టూ పోసుకోవాలి. 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేప పిండి, 2 కిలోల ట్రైకొడెర్మవిరిడి కలుపుకొని నీడ ఉన్న ప్రదేశములో 10 నుండి 12 రోజులు మగ్గపెట్టుకొని ప్రతి చెట్టుకి 10 కిలోల వరకు వేసుకోవాలి.

ఆకుముడత పురుగు

nimma aku mudatha purugu
aku mudatha

ఆకుముడత పురుగు ఆశించినప్పుడు నివార చర్యగా ఇమిడాక్లోప్రిడ్ 0.5 మీ.లీ (లేదా) ప్రోపెనోఫాస్ 2 మీ.లీ (లేదా) థాయోమిథాక్సోం 0.3 గ్రాములు ఒక్క లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

తామర పురుగు

thamara purugu

ఈ తామర పురుగు ఆకులపై, కాయలపై పత్రహరితాన్ని పీల్చడము ద్వారా కాయలపై మరియు ఆకులపై మచ్చలుగా ఏర్పడుతాయి. ఇందుకోసం నివార చర్యగా డైకోపాల్ 3 మీ.లీ (లేదా) ప్రోపర్గైట్ 2 మీ.లీ ఒక్క లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *