నేల తయారి
కాకరకాయ పంటకు ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, నీరు ఇంకే నేలలు అనువైనవి. నేల యొక్క PH విలువ 5.5 – 6.4 ఉన్న నేలను ఎంచుకోవాలి. విత్తనం వెయ్యడానికి ముందు నేలను 2-3 సార్లు మట్టి వదులు అయ్యేలా దున్నుకోవాలి. చివరి దుక్కికి ముందు 8-10 టన్నుల పశువుల ఎరువు + 25 కిలోల యూరియ +50 కిలోల DAP + 25 కిలోల పోటాష్ వేసుకొని చివరి దుక్కి చేసుకోవాలి.
పందిరి విధానాలు
మన తెలుగు రైతులు ఎక్కువగా అడ్డు పందిరి మరియు శాశ్వత పై పందిరిలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ అడ్డుపందిరిలను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే పందిరి అని చెప్పుకోవచ్చు. దీనిలో పంట మార్పిడిలో తొలగించి మరల ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. శాశ్వత పై పందిరి ఏర్పాటు చేసుకోవడం వలన ఒక్కే ఖర్చుతో శాశ్వతంగా తీగ పంటలను వేసుకోవచ్చు. దీనికి డ్రిప్ ఇరిగేషన్ అనువుగా ఉంటుంది.
విత్తనం విత్తుకునే విధానం
ఒక్క ఎకరానికి హైబ్రిడ్ విత్తనాలు అయితే 500-600 గ్రాములు లేదా సూటిరకం ( దేశవాళి రకం ) అయితే 800-1 కిలో విత్తనాల వరకు అవసరం పడుతాయి. విత్తుకునేప్పుడు సాలుల మధ్య దూరం 2 మీటర్లు, మొక్కల మధ్య దూరం 50 cm ఉండేలా విత్తుకోవాలి.
- విత్తిన 4-6 రోజుల మధ్య విత్తనం మొలకెత్తడం ప్రారంబమవుతుంది.
- 40-45 రోజుల మధ్య పూత మొదలవుతుంది.
- 55-60 రోజుల మధ్య మొదటి కోత మొదలవుతుంది.
పంట వయస్సు 20-25 రోజుల మధ్య బోరాన్ 2 గ్రాములు ఒక్క లీటర్ నీటికి మరియు పూత దశలో ఉన్నపుడు పిచికారి చేసుకోవాలి. పూత దశలో బోరాన్ పిచికారి చెయ్యడం వలన మగ పుష్పాల వృద్ధిని తగ్గించి ఆడ పుష్పలను వృద్ధి చెయ్యడం జరుగుతుంది.
నీటి యాజమాన్యం
తీగ మొక్కల సాగులో డ్రిప్ మరియు మల్చింగ్ కవర్ సాగు పద్ధతి చాల అనువుగా ఉంటుంది. డ్రిప్ ద్వారా నీటిని అందిస్తే ప్రతి రోజు ఒక్క గంట సమయం పాటు అందిస్తే సరిపోతుంది. నీటి పారుదల ద్వారా నీటిని అందించే రైతులు భూమి యొక్క స్వభావాన్ని బట్టి నేల పూర్తిగా ఎండిపోకుండా ఉండేలా నీటిని అందించాలి.
తెగుళ్ళు మరియు చిడపిడల నివారణ
పండు ఈగ
పండు ఈగ ఆశించిన కాయలను పంట చేను నుండి తొలగించి ఒక్క గుంత తీసి అందులో వేసి మట్టి కప్పివేయ్యాలి. దీని నివారణకు మాలాథియాన్ 2 మీ.లీ ఒక్క లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చెయ్యాలి.
బూడిద తెగులు
ఈ తెగులు చలి ఎక్కువ ఉన్నపుడు లేదా వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నపుడు ఈ బూడిద తెగులు ఉదృతంగా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు డైనోకప్ 5 మీ.లీ. లేదా మైక్లోబ్యుటానిల్ 0.5 గ్రా” లేదా హేక్సాకోనజోల్ 1 గ్రా” ఒక్క లీటరు నీటికి కలుపుకొని పిచ్చికారి చేసుకోవాలి.
మచ్చ తెగులు
ఈ మచ్చ తెగులు ఆకులపై చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి అవి క్రమేపి పెరిగి ఆకూ మొత్తాన్ని విస్తరించి ఆకులు ఎండిపోయేల చేస్తుంది. దీని నివారణకు మంకొజేబ్ 3 గ్రా” లేదా కార్బండిజమ్ 2 గ్రా” లేదా సాఫ్ 2 గ్రా” ఒక్క లీటర్ నీటికి కలుపుకొని పిచ్చికారి చేసుకోవాలి.