సోయా చిక్కుడు పంట ద్వారా భూసారం కూడా పెరుగుతుంది. ఇది స్వల్పకాలిక పంట 90-110 రోజులలో పంట కాలం పూర్తి అవుతుంది. జూన్ మొదటి వారం నుండి జులై మొదటి వారం మధ్య విత్తుకోవడానికి అనుకులమైన సమయము. మన తెలుగు రైతులు ఎక్కువగా ఈ పంటకు వర్షాధార పంటగా సాగుచేస్తున్నారు. ఈ పంటకు నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా సాగుకు అనుకూలము. ఈ పంట వేరే పంటలతో పోలిస్తే శ్రమ మరియు పెట్టుబడులు తక్కువగా ఉంటాయి. సోయా చిక్కుడు పంటకు నల్లరేగడి నేలలు మరియు తేమ ఎక్కువగా ఉండే బరువు నేలలు అనువైనవి.
నేల తయారి
విత్తనానికి ముందు నేల వదులు అయ్యే వరకు 2-3 సార్లు దున్నుకోవాలి. చివరి దుక్కికి ముందు 4 టన్నుల పశువుల ఎరువు, 25-30 కిలోల యూరియ, 150 -180 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ మరియు 26-30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ వేసుకొని చివరి దమ్ము చేసుకొని విత్తనం వేసుకోవడానికి సిద్ధంగా ఉంచుకోవాలి.
విత్తుకునే విధానం
సోయా చిక్కుడు వేసే ముందు విత్తన సేకరణ చాల ముఖ్యమైనది. మొలక శాతం ఎక్కువగా ఉన్న నాణ్యమైన కొత్త విత్తనాన్ని ఎంచుకోవాలి. పాత విత్తనం అయితే మొలక శాతం తక్కువగా ఉంటుంది దీనివల్ల దిగుబడిపై ప్రభావం చూపుతుంది.
విత్తన మొలక శాతాన్ని అంచనా వెయ్యడానికి మనం విత్తనం వెయ్యడానికి ఎంచుకున్న విత్తనము నుండి ఒకే ప్రదేశం నుండి కాకుండా అన్నివైపుల వచ్చేలా 100 సోయా చిక్కుడు గింజలను సేకరించాలి. ఆ విత్తనాలను నేలమీద ఒక ప్రదేశంలో విత్తుకోవాలి 7-10 రోజులలో మొలకలు వస్తాయి. అందులో 70కి పైగా మొలక వస్తే ఆ విత్తనం విత్తుకోవడానికి అనుకూలము అని చెప్పుకోవచ్చు. కానీ 70 కన్నా తక్కువగా మొలకలు వస్తే విత్తనాన్ని మార్చుకోవాలి లేదా విత్తన మోతాదును పెంచుకోవాలి.
సోయా చిక్కుడు విత్తనం వేసుకునేప్పుడు నేల తేమగా ఉన్న సమయంలో విత్తుకోవాలి. దీనివల్ల మొలక శాతం పెరుగుతుంది. విత్తనాన్ని శుద్ధి చెయ్యడం కోసం 1 కిలో విత్తనానికి 2.5 గ్రాముల తైరం మరియు 3 గ్రాముల కాప్టన్ లను విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. పాటించవలసిన దూరాలు వరుసల మధ్య దూరం 40 cm, మొక్కల మధ్య దూరం 8 cm ఉండేలా చూసుకొని విత్తుకోవాలి.
పంట వయస్సు 30 రోజులు ఉన్న సమయంలో ఎకరానికి 15 – 20 కిలోల యూరియని వేసుకోవాలి.
కలుపు నివారణ
విత్తుకున్న 48 గంటలలోపు 1 లీటర్ నీటికి 5 ml పెండిమిథాలిన్ కలుపుకొని నేల మొత్తం తడిచేవిధంగా పిచికారి చేసుకోవాలి. మొక్కలు ఎదుగుతున్న సమయంలో గుంటుక లేదా గోర్రుతో అంతర కృషి ద్వార కలుపుని నిర్మూలించాలి. పంట చేనులో గుంటుక లేదా గోర్రులతో దున్నడం వలన మట్టి మొక్క యొక్క మొదలుకు ఎగదోయ్యబడి మొక్క బలంగా తయారవుతుంది.
నీటి యాజమాన్యం
మన తెలుగు రైతులు సోయా చిక్కుడు పంటను వర్షాధార పంటగా సాగుచేస్తారు కావున ఈ పంటకు నీటి వినియోగం తక్కువగానే ఉంటుంది. వర్షపాతం తక్కువగా ఉన్న సమయాల్లో 10 – 20 రోజులప్పుడు నీటిని అందించాలి. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న సమయంలో పంట వయస్సు 45 – 50 రోజులకి పూత దశలో మరియు గింజ బలపడే సమయంలో నీటిని కచ్చితంగా అందించాలి. మొక్క ఎదుగుతున్న సమయాల్లో వర్షపాతం తక్కువగా ఉంటె భూమి స్వభవాన్ని బట్టి నీటి తడులను అందించాలి.
తెగుళ్ళు మరియు చీడపిడలు
కాండం తొలిచే పురుగు
నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 1.6 ml ఎసిఫేట్ పిచికారి చేసుకోవాలి.
ఆకు మచ్చ తెగులు
నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 1 గ్రాము కర్బండిజం మరియు 1 ml ప్రోపికోనజోల్ కలుపుకొని పిచికారి చేసుకొనవలెను.
Excellent