వంగ సాగును మన రైతులు దీర్ఘకాలిక పంటగా మరియు స్వల్పకాలిక పంటగా సాగు చెయ్యడం జరుగుతుంది. దీర్ఘకాలిక పంట 7-8 నెలల వరకు పంట కాలం ఉంటుంది. తెగుళ్ళు మరియు పురుగు ఆశించకుండా ఉన్నపుడు మాత్రమే దీర్ఘకాలిక పంటకు వెళ్ళడం మంచిది. లేకపోతే దిగుబడి రాకపోగా పెట్టుబడి పెరిగి లాభాలు తగ్గడాలు జరుగుతాయి.
నేల సిద్ధం చేసుకునే విధానం
నేలలో పోషకాలు శాతం ఎక్కువగా ఉంటేనే ఏ పంట అయిన అధిక దిగుబడులను పొందడం జరుగుతుంది. కావున పంటకు ముందే భూమిని పోషకాలతో బలంగా తయారు చేసుకోవాలి. వంగ పంట వేయడానికి ఎంచుకున్న నేలలను వదులుగా అయ్యేవరకు 2-3 సార్లు ట్రాక్టర్ కల్టివేటర్ తో దున్నుకోవాలి. ఇలా 2-3 సార్లు దమ్ము చేసుకోవడం వల్ల కలుపు మొక్క విత్తనం నాశనం చేయ్యబడుతుంది. అలాగే పంట మొక్కల వేర్లు సులువుగా నేలలోకి చొచ్చుకొని వెళ్లి మొక్క బలంగా ఉంటుంది. చివరి దుక్కిలో పశువుల ఎరువు 8 టన్నులు, 25 కిలోల భాస్వరం మరియు 25 కిలోల పొటాషియం ఎరువులను వేసుకొని నేల మొత్తాన్ని కలియదున్నుకోవాలి. బ్యాక్టీరియ ఎండు తెగులు రాకుండా ముందస్తు జాగ్రత్తగా ఎకరానికి 6 కిలోల బ్లీచింగ్ చల్లుకోవాలి.
ఎకరానికి నత్రజని ఇచ్చే దేశీయ రకానికి 50 కిలోల, హైబ్రిడ్ రకానికి 75 కిలోల ఎరువులను మూడు సమభాగాలుగా చేసుకొని 30వ రోజు, 60వ రోజు మరియు 80వ రోజు వేసుకోవాలి.
విత్తనం రకాలు
భాగ్యమతి : పంట కాలం 150-165 రోజులు, దిగుబడి 12-14 టన్నుల వరకు ఉంటుంది.
శ్యామల : పంట కాలం 130-150 రోజులు, దిగుబడి 7-9 టన్నుల వరకు ఉంటుంది.
పూస పర్పుల్ క్లస్టర్ : పంట కాలం 135-145 రోజులు, దిగుబడి 13-16 టన్నుల వరకు ఉంటుంది.
పూస పర్పుల్ లాంగ్ : పంట కాలం 135-145 రోజులు, దిగుబడి 13-16 టన్నుల వరకు ఉంటుంది.
పూస క్రాంతి : పంట కాలం 135-150 రోజులు, దిగుబడి 14-16 టన్నుల వరకు ఉంటుంది.
నారు పోసుకునే విధానం
నారును పెంచడానికి ఎంచుకున్న నేలను నేల ఎత్తుకు నాలుగు అంగుళాల ఎత్తులో మట్టిని బెడ్డుల రూపములో తయారు చేసుకోవాలి బెడ్డుకి, బెడ్డుకి మధ్య దూరం కనీసం ఒక్క అడుగు దూరం ఉండేల చూసుకోవాలి. ఇది కాలిబాటకి అనువుగా ఉండి సష్యరక్షణకు అనువుగా ఉంటుంది. విత్తనాలు ఒక్క ఎకరానికి దేశీయ రకం విత్తనాలు అయితే 260 గ్రాములు లేదా హైబ్రీడ్ రకం విత్తనాలు అయితే 120 గ్రాములు అవసరం పడుతాయి. బెడ్డులపై విత్తనాలను విత్తుకునే ముందు సమానమైన గీతాలు లేదా గుర్తులు చేసుకొని విత్తనాల మధ్య దూరం ఒక్క సెంటి మీటరు ఉండేలా వేసుకోవాలి. విత్తుకున్న తరువాత సన్నని మట్టిని విత్తనలపై వేసుకొని పైపాటుగా నీటిని అందించి ఎండిన వరి గడ్డిని పలుచగా పైపోరగా బెడ్డులపై పరుచుకోవాలి.
నాటుకునే విధానం
డ్రిప్ పద్ధతిలో వేసుకునే రైతులు మొక్కలను నాటుకునే సాలులను కొంచం ఎత్తువరకు చేసుకుని ముల్చింగ్ కవర్ తో నాటుకోవడం మంచిది. దిని వల్ల కలుపు నివారణ, సాగునీటిని వృధ కాకుండా మరియు పోషక ఎరువులను డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అందించవచ్చు.
తెగుళ్ళు మరియు చీడపీడలనుండి నివారణ
కాయతొలుచు పురుగు (కాయ పుచ్చు పురుగు) మరియు కాండంతోలుచు పురుగు
కాయతొలుచు పురుగు
కాండంతొలుచు పురుగు
వంకాయ సాగులో దిగుబడులు పడిపోవడానికి ముఖ్యమైన కారణం కాయతొలుచు పురుగు. దీని వృద్ధితి ఎక్కువ అయితే దీనిని అదుపుచెయ్యడం కష్టతరంగా మారుతుంది కావున మొదట్లోనే తగు చర్యలు తీసుకోవాలి. పుచ్చు పట్టిన కాయలను పంట చేను నుండి తొలగించి నివారణ చర్యలు చేపట్టాలి.
నివారణ చర్యలు
ఒక్క లీటర్ నీటికి 2 మీ.లీ ప్రోఫేనోఫాస్ లేదా 1 మీ.లీ. సైపర్ మెత్రిన్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
ఎండు తెగులు
ముందస్తుగా మొక్కలను నాటకముందు బ్లీచింగ్ పౌడర్ ఎకరానికి 6 కిలోలు చల్లుకోవాలి. ఎర పంటగా 4-6 సాలుల మద్య బంతి సాలును వేసుకోవాలి. ఎండు తెగులు సోకినట్లుగా ఉంటె పంట మార్పిడిగా క్యాబేజీ పంటను వేసుకొని ఎండు తెగులును నివారించావచ్చు.