నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా శనగ సాగు చెయ్యడానికి అనుకూలం. ఈ పంటను ఎక్కువగా రెండవ పంటగా రబీలో వేస్తారు. అక్టోబర్ నుండి నవంబర్ మధ్య విత్తుకోవడానికి అనుకూలమైన సమయం. ఈ పంట మంచు ఆధారంగా పండే పంట కావున పూత మరియు కాయలు మొదలయ్యే సమయాల్లో నీటిని అందించిన సరిపోతుంది. ఇది స్వల్ప కాలిక పంట కావున విత్తన రకాన్ని బట్టి 85 – 100 రోజులలో పూర్తి అవుతుంది.
నేల తయారి
నేల వదులు అయ్యేవరకు 2-3 సార్లు దమ్ము చేసుకోవాలి. శనగ పంట సాగుకు చౌడు నేలలు మరియు నీరు నిల్వ ఉండే నేలలు తప్ప అన్ని రకాల నేలలు అనుకూలం. నల్లరేగడి మరియు తేమ శాతం ఎక్కువ కాలం ఉండే బరువు నేలలు అయితే అధిక దిగుబడులను పొందవచ్చు. నేల యొక్క ఉదజని సూచిక (PH విలువ) 6-7 ఉన్న నేలలు సాగుకు అనువైనవి. చివరి దుక్కికి ముందు 10 కిలోల నత్రజని (యూరియ) మరియు 20 కిలోల భాస్వరం వేసుకొని చివరి దమ్ము చేసుకోవాలి.
విత్తుకునే విధానం
విత్తనానికి ముందు విత్తన శుద్ధి కచ్చితంగా చేసుకోవాలి. ఈ విత్తనశుద్ది వలన నేలనుండి సంక్రమించే ఎండు తెగులును ముందస్తుగా నివారించడానికి వీలవుతుంది. విత్తనాన్ని శుద్ధి చెయ్యడం కోసం 1 కిలో విత్తనానికి ట్రైకోడెర్మవిరిడి 8 గ్రాములు, 2.5 గ్రాముల తైరం మరియు 3 గ్రాముల కాప్టన్ లను విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఎకరానికి మధ్యస్థ పరిమాణం గల గింజలు అయితే 25-30 కిలోల విత్తనాలు అవసరం పడుతాయి. పెద్ద పరిమాణం గల తెల్ల గింజలు అయితే 35-45 కిలోల విత్తనం అవసరం పడుతాయి. విత్తనం విత్తుకోవడంలో ఆలస్యం అయితే పూత దశలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నపుడు పూత రాలిపోయే అవకాశాలు ఎక్కువ కావున అక్టోబర్ నుండి నవంబర్ చివరి వరకు విత్తుకోవడానికి సరైన కాలం. విత్తే సమయంలో నేలలో కొద్దిగా తేమ ఉండేలా చూసుకోవాలి.
కలుపు నివారణ
విత్తిన 48 గంటలలో ఒక లీటర్ నీటికి 5 ml పెండిమితలిన్ నేల మొత్తం తడిచేవిధంగా పిచికారి చేసుకోవలెను. మొక్కలు ఎదుగుతున్న సమయంలో మనుషుల సహాయంతో అంతర కృషి ద్వారా కలుపును తొలగించవలెను.
నీటి యాజమాన్యం
శనగ పంట మంచు ఆధారిత పంట అని చెప్పుకోవచ్చు. ఈ పంటకు నీటి వినియోగం కూడా చాల తక్కువగా ఉంటుంది. పూత మొదలయ్యే 30-35 రోజుల మధ్య మరియు గింజ బలపడే దశలలో నీటిని అందించాలి. నీరు అందుబాటులో ఉన్న రైతులు నేల స్వబావాన్ని బట్టి నీటిని అందిచడం వలన అధిక దిగుబడులను పొందవచ్చు.
తెగుళ్ళు మరియు చీడపీడలు
శనగపచ్చ పురుగు
ఈ శనగపచ్చ తల్లి పురుగు లేత ఆకులపై మరియు పుష్పాలపై గుడ్లు పెడుతాయి. గుడ్ల నుండి వచ్చిన లార్వాలు ఆకులను మరియు పుష్పాలను తినడం ప్రారంబిస్తాయి. కాయలలోనికి చొచ్చుకుపోయి లోపల ఉన్న గింజలను పంట చేనుకు నష్టం కలుగ చేస్తాయి. కావున నివార చర్యగా తక్కువ ఉదృతి తక్కువగా ఉన్న సమయంలో 5% గల వేప కాషాయం లేదా వేప సంబధిత ఉత్పత్తులను 5 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకొనవలెను. ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు రసాయనాలను ఉపయోగించవలసి వచ్చినప్పుడు 1 లీటర్ నీటికి 1 గ్రాము ఎసిఫేట్ లేదా 2 ml స్వినలోఫాస్ లేదా 1 ml ఇండాక్సకార్బ్ కలుపుకొని పిచికారి చేసుకొనవలెను.
పచ్చ రబ్బరు పురుగు
పచ్చ రబ్బరు పురుగు గుంపులకు గుంపులుగా చేరి ఆకులపై గిరుకు తినడం వలన ఆకులు జల్లెడవలె మరి పంట దిగుబడిపై ప్రబావం పడుతుంది. దిని నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 2 గ్రాముల తయోడికార్బ్ లేదా 1 గ్రాము ఎసిఫేట్ లేదా 1 ml ఇండాక్సకార్బ్ కలుపుకొని పిచికారి చేసుకొనవలెను.
ఎండు తెగులు
ఎండు తెగులు పంట తొలిదశలోనే ఆశిస్తుంది. ఈ తెగులు సోకినా మొక్కలు ఓకే ప్రదేశం వద్ద చాల మొక్కలు ఎండిపోతాయి. నీరు నిల్వ ఉన్న ప్రదేశంలో ఈ తెగులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎండు తెగులు సోకినా పంట చేనును ఈ తెగులు నివారణ చాల కష్టం కావున ముందస్తుగానే విత్తుకునేప్పుడు విత్తనశుద్దిగా 1 కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడెర్మవిరిడి మరియు 2 గ్రాముల కార్బండిజం విత్తనాలకు పట్టించి విత్తుకోవడం వలన ఎండు తెగులును ముందస్తుగా నివారించవచ్చు.