కీరదోసకాయ సాగు విధానం ( keera dosa cultivation in telugu )

నేల తయారి విధానం 

కీరదోసకాయ పంటకు అనువైన నేలలు నల్లరేగడి నేలలు, ఎర్రనేలలు, సారవంతమైన నీరు ఇంకే నేలలు ఈ పంటకు అనువైనవి. కానీ లవణ శాతం ఎక్కువ ఉన్న నేలలు ఈ పంటకు పనికి రావు.  తీగజాతి మొక్కలను నేల మీద పండించవలసి వచ్చినప్పుడు నీరు ఇంకే తేలిక పాటి లేదా ఇసుక గల చౌక నేలలో మాత్రమే నేల పంటలుగా వేసుకోవలెను.

నేల వదులు అయ్యేలా 2-3 సార్లు దుక్కిని దమ్ము చేసుకోవాలి. చివరి దమ్ములో ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు,  200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 35 కిలోల మ్యురియేట్ ఆఫ్ పోటాష్ వేసుకొని చివరి దుక్కి వేసుకొని సిద్ధం చేసుకోవాలి.

విత్తుకునే విధానం 

ఎకరానికి 300-400 గ్రాముల విత్తనాలు అవసరం పడుతాయి. విత్తేముందు ఒక్క 1 కిలో విత్తనానికి  5 ml ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్.ఎస్ లేదా 3 గ్రా” తైరం లేదా 3 గ్రా” కార్బండిజంతో విత్తన శుద్ధి చేసుకొనవలెను. పాటించవలసిన దూరాలు సాలుల మధ్య దూరం 1.5 మీటర్లు, మొక్కకి మొక్కకి మద్య దూరం 45-50 సెంటి మీటర్లు ఉండేలా చూసుకొని విత్తనాలను విత్తుకోవాలి. డ్రిప్ పద్ధతిని ఉపయోగించే రైతులు ఎత్తు బెడ్లను మరియు మల్చింగ్ కవర్లను ఉపయోగించి పై దూరాలను అనుసరించి విత్తనాలను విత్తుకోవాలి. ఈ ఎత్తు బెడ్లను మరియు మల్చింగ్ కవర్లను వినియోగించడం ద్వారా పంట యొక్క దిగుబడిని 20-30 శాతం వరకు పెంచవచ్చు. మల్చింగ్ కవర్లను వినియోగించడం ద్వారా కలుపును నివారించవచ్చు. డ్రిప్ ద్వారా 50 శాతం వరకు నీటిని ఆదా చెయ్యవచ్చు. 

కీరదోసకాయ తీగ జాతి మొక్క కావున దీనిని నేలమీద కంటే పై పందిరి లేదా అడ్డు పందిరిలను ఉపయోగించి మొక్కలు నేలకు తగలకుండా మొక్కలను పెంచడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు. నేలమీద పండించే మొక్కలలో కలుపు తియ్యడం కష్టంగా ఉంటుంది. కాయల యొక్క ఆకృతి కూడా బాగుండదు. దిగుబడి ప్రారంభం అయినప్పుడు పంటచేనులో కాయలను కోసే సమయాలలో మొక్కల కాండలు కాళ్ళ కింద పడి మొక్కలు మరియు కొమ్మలు చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కావున రైతు సోదరులు పై పందిరి లేదా అడ్డు పందిరిలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా పంట కాలాన్ని పెంచుకోవడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు. 

సాగు యాజమాన్యం 

మొక్కలు మొలకెత్తిన తరువాత 2-4 ఆకుల దశలో ఉన్నపుడు బోరాన్ లోపం రాకుండా ఉండటానికి ఒక్క లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి. 

పంట వయస్సు 15-20 రోజుల మధ్య మొక్క యొక్క మొదటి రెండు వరుస ఆకులను తొలగించాలి.

విత్తిన 20-30 రోజులకు పూత దశలో ఎకరానికి 45 కిలోల యూరియ (నత్రజని) చేసుకోవాలి. 

పందిరి పద్ధతిని ఉపయోగించి సాగు చేస్తున్న క్రమములో కింద ఉండే ఆకులను తొలగించాలి మరియు ఇతర కొమ్మలను తొలగించి ఒకే ఒక్క కొమ్మ పైకి పారేవిధంగా చెయ్యాలి. మొక్క పైకి పాకడానికి సపోర్ట్ గా దారాలతో కట్టాలి.  

మగ పుష్పల శాతాన్ని తగ్గించి, ఆడ పూష్పల శాతాన్ని పెంచడానికి పూతకు ముందు 10 లీటర్ల నీటికి 2.5 గ్రాముల సైకోసిల్ లేదా 2.5 గ్రాముల ఇథరిన్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి. 

పూత మరియు కాత రాలిపోకుండా మొక్కపై నిలవడానికి ఒక్క లీటర్ నీటికి 5 గ్రాముల సుక్ష్మధాతు (19:19:19) మరియు 0.25 ml  ప్లోనోఫిక్స్ పిచికారి చెయ్యవలెను.

తెగుళ్ళు మరియు చిడ పీడలు 

బూడిద తెగులు 

ఈ బూడిద తెగులు ఆశించిన మొక్కల ఆకులపై చిన్న మచ్చలు ఏర్పడి క్రమంగా ఆకు మొత్తం విస్తరించి ఆకు పండుబారిపోయి రాలిపోతాయి. దీని నివారణకు ఒక్క లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం కలుపుకొని పిచికారి చేసుకోవాలి. 

లీఫ్ మైనర్

ఈ లీఫ్ మైనర్ తెగులు అనేది లార్వా ఆకుల మధ్య భాగంలో బాహ్య పొరను వదిలేసి లోపడి భాగాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఇది చూడటానికి ఎలుకల బోరియ(కన్నం) లాగా ఉంటాయి. ఈ తెగులు వల్ల మొక్క ఆకుపై తెల్లని చారలు ఏర్పడుతాయి. దీని వల్ల మొక్కకు కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ తగ్గుతుంది. దీనివల్ల మొక్కకు మరియు కాయల అభివృద్ధిపై ప్రభావం పడుతుంది.

నివారణ చర్యలు

లీఫ్ మైనర్ తెగులు సోకినా తెల్లని చారలు ఉన్న ఆకులను వెంటనే మొక్కనుండి తొలగించాలి. అలాగే వేపనునే 3-4% నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఈ తెగులు ఎక్కువగా వ్యాపించి ఉంటె  ట్రయాజోఫోస్ (Triazophos) లీటర్ నీటిలో 1 మీ.లీ (ml) కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

పేనుబంక

పేనుబంక రసంపీల్చడం వల్ల మొక్క పెరుగుదలను దెబ్బ తీస్తుంది. పొడి వాతావరణంలో మరియు మొక్కకు నీటి ఒత్తిడి ఉన్నప్పుడు పెనుబంక ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మొక్క లేత ఆకు నుండి రసం పీల్చడం వల్ల మొక్క నిరసనగామరి ఆకులు ఆకుపచ్చ రంగు నుండి పసుపుపచ్చ రంగుకు మరుతాయి. 

నివారణ చర్యలు

మోనోక్రోటోఫోస్ 1.5 మీ.లీ. లేదా డైమీతోయేట్ 2 మీ.లీ. లేదా ఎసిఫేట్ 1 గ్రాము లీటరు నీటిలో కలుపుకొని పిచికారి చేసుకోవాలి. 

తామర తెగులు

తామర తెగులు ఆశించిన పంట చేనుకు నివారణ చర్యగా ఒక్క లీటర్ నీటికి 2 ml డైమితోయేట్ లేదా 3 ml ఇమిడాక్లోప్రిడ్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి. 

వెర్రి తెగులు 

ఇది వైరస్ ద్వారా ఏర్పడుతుంది. దీనివల్ల పూత మరియు కాత నిలవకుండా రాలిపోవడం కానీ, మొక్కలు గోడు బారిపోవడం జరుగుతుంది. ఈ తెగులు బారిన పడ్డ మొక్కలను పంట చేను నుండి తొలగించివేయ్యాలి.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *